Friday, November 12, 2021

అప్పులేని సంసారమైనపాటే చాలు..!

 


సంగీత కళానిధి శ్రీ నేదునూరి కృష్ణమూర్తిగారి
అన్నమయ్య పదసౌరభము పుస్తకానికి 
నేను వేసిన ముఖచిత్రం


తృప్తితో జీవించడం ఎలా..!?
 
పోతన భాగవతం లో వామనుడు మూడడుగుల నేల  మాత్రమే కోరుకోవడం చూసి బలిచక్రవర్తి, వరచేలంబులో మాడలో ఫలములో వన్యంబులో గోవులో.. అంటూ చాలా పెద్ద జాబితా చెప్పి అవన్నీ కానీ, వాటిల్లో కనీసం ఏవొక్కటైనా గానీ    కోరుకోమ్మనీ,  ఇచ్చేస్తాననీ అంటాడు.

అప్పుడు వామనుడు అంటాడు:


వ్యాప్తిన్ జెందక,వగవక,
ప్రాప్తించినలేశమైన పదివేలనిచున్
దృప్తింజెందని మనుజుఁడు
సప్త ద్వీపములనైనఁ జక్కంబడునే?



ఉన్నది చాలదన్నట్టు ఇంకా కావాలనుకోక, శోకాన్ని విడిచిపెట్టి,  దొరికిన కాసింతయే పదివేలనుకొని తృప్తి చెందని మనుజుడు భూమిమీద ఎక్కడైనా బాగుపడతాడా అని భావం. 

ఈ క్రింది కీర్తనలో మనిషిగా బ్రతకడానికి ఎంత చాలో (సరిపోతుందో) చెబుతున్నాడు అన్నమయ్య..! ఆంగ్లంలో Down to earth అంటాము కదా,  అలాంటి నిరాడంబర జీవితానికి, బ్రతుకడానికి అవసరమైనంత మాత్రమే కలిగి ఉంటూ తృప్తిగా ఎలా జీవించవచ్చో చెబుతున్నాడు.

పల్లవి :
అప్పులేనిసంసార మైనపాటే చాలు
తప్పులేనిజీత మొక్కతారమైనఁ జాలు

అప్పులేనివాడె అధిక సంపన్నుడు అన్నాడు వేమన. అన్నమయ్య, సంసారము అప్పులు లేకుండా ఉంటే చాలంటున్నాడు. ఐన పాటే చాలు అంటే అంత మాత్రమే చాలు అని..! తప్పుచేయగుండా ఆర్జించిన జీతము/ సంపాదన ఒక్క తారము ( నాలుగు కాసుల నాణెము) అయినా చాలు అంటున్నాడు. అంటే అప్పు, తప్పు చేయవద్దని..!

చరణం:
కంతలేనిగుడిశొక్కగంపంతయినఁ జాలు
చింతలేనుయంబ లొక్కచేరెఁడే చాలు
జంతగానితరుణి యేజాతైన నదె చాలు
వింతలేనిసంప దొక్కవీసమే చాలు


వ్యాఖ్యానము:
కంత = రంధ్రము, చిల్లు, ప్రకృతి నుంచి రక్షణ పొందటానికి ఒక పైకప్పుకు రంధ్రాలు లేని ఒక్క గుడిశ చాలు..! తినేది చారెడు అంబలే అయినా చింత లేకుండా - అంటే ఆలోచనలూ, ఆదుర్దా, బెంగా లేకుండా హాయిగా తింటే అదే చాలు.
జంత = ధూర్తురాలు, తిరుగుబోతు. స్త్రీలలో పద్మిని జాతి, ఇత్యాదిగా  నాలుగు జాతులు, వాటిబట్టీ ఆయా జాతులవారి లక్షణాలు చెబుతారు. పద్మిని జాతి స్త్రీ ఉత్తమలక్షణాలు కలిగి ఉంటుందని అంటారు. భార్య యైన స్త్రీ ఏ జాతి యైనా సరే జంత - అంటే చెడుతిరుగుళ్ళు తిరిగేది కాకపోతే అంతే చాలు.
మన సంపాదన వింతనూ, ఆశ్చర్యాన్నీ కలిగించకూడదు. అలాంటి ఆకస్మిక ధనలాభం లేదా ఆదాయానికి మించిన ఆస్తులు లేకుండా అంటే అక్రమార్జన లేని ఒక్క వీసమెత్తు సంపద (వీసము - రూకలో పదహారవ భాగము) ఉన్నా అదే చాలు.

చరణం 2: 
తిట్టులేనిబ్రదు కొక్కదినమైన నదె చాలు
ముట్టులేనికూ డొక్కముద్దెఁడే చాలు
గుట్టుచెడి మనుకంటే కొంచపుమేలైనఁ జాలు
వట్టిజాలిఁ బడుకంటే వచ్చినంతే చాలు


వ్యాఖ్యానము:
మాటపడకుండా బ్రతికే ఒక్క రోజైనా చాలు జీవితానికి..! ముట్టు లేని - శుచి లేనిది కాని (అంటే శుచి యైనది) ఒక్క ముద్దయైనా చాలు భోజనానికి..! గుట్టు చెడిపోయి మనుగడ సాగించడం కంటె తక్కువలోఉన్నా సుఖంగా ఉంటే చాలు. అంటే ఆర్భాటాలకి పోయి ఇంటి గుట్టు బయట పెట్టుకొనే బదులు సామాన్యంగా ఉన్నా సంతోషంగా జీవిస్తే చాలు. ప్రయోజనం లేని/ రాబడి రాని పనికి పరుగెత్తే బదులు ఎంతవస్తే అంతే చాలు.

చరణం-3:
లంపటపడనిమేలు లవలేశమే చాలు
రొంపికంబమౌకంటె రోయుటే చాలు
రంపపుఁగోరికకంటె రతి వేంకటపతి-
పంపున నాతనిఁజేరేభవమే చాలు 
 
వ్యాఖ్యానము:
ఆపదకలుగజేయని మేలు అతిచిన్నది చేసినా చాలు..! రొంపికంబము - నిలుకడ లేనిది, అస్థిరమైనది; రోయు = రోత పడు, విడిచిపెట్టు. నిలుకడలేకుండా ఉండే పని కన్నా నివారించడం/ విడిచి పెట్టడం మేలు. రంపపు కోతకు గురిచేసే కోరికలతో అల్లాడడం కన్నా శ్రీవేంకటపతి పంపున ( ఆజ్ఞకు లోబడి) ఆ స్వామిని చేరే బ్రతుకే చాలు.


గరికపాటి వారు వ్రాసిన క్రింది పద్యం ఈ సందర్భంగా చెప్పుకొనదగినది:

"తినుటకు నున్నచాలు అతిథిం గనినంతనె తల్పుతీసి ర/
మ్మనుటకునున్నచాలుతన యాలును బిడ్డలు నొక్కచోట కూ/
ర్చొనుటకునున్నచాలు పెడచూపులు చూడక మంచిదారిలో /
మనుటకునున్నచాలుమనమా!రసమార్గమువీడబోకుమా!

Monday, April 23, 2012

తొలి తెలుగు వాగ్గేయ కారుడు - కృష్ణమయ్య

ఒక బాలుడు.. ఉత్తమ సంస్కారమూ, పాండిత్యమూ, దైవభక్తీ ఉన్న కుటుంబం లో పుట్టినవాడు.. అంధత్వం తో జన్మించిన విధి వంచితుడు... కన్నవారి చేతే, ఎవరో చెప్పిన మాటలు నమ్మి దురదృష్ట జాతకుడిగా ముద్రపడి,    వద్దనుకొని పాడుపడ్డ బావిలో పారవేయ బడ్డవాడు. విధి విరిచేసిన ఆ బాలుడి జీవితాన్నిసింహగిరిపై కొలువున్న శ్రీ వరాహ నృసింహ స్వామి దరి చేర్చాడు. 12 - 13  వ శతాబ్దాలకు చెందిన ఆ బాలుడే పెరిగి పెద్దవాడై సింహగిరి నరహరి వచనములు వ్రాసి శ్రీకంఠ కృష్ణమాచార్యులు లేదా కృష్ణమయ్య గా ప్రసిద్ది కెక్కాడు. ఆ అంధ బాలుడిని బావిలో తీగలమధ్య వ్రేలాడుతుండగా చూసిన శ్రీమాన్ కృష్ణ కుమార స్వామి అనే గురువుగారు తమ వద్దకు చేర్చుకొన్నారు. గురువుగారి  పెంపకం లోనే కాస్త పెద్దవాడయాడు.
ఒకనాడు గురువుగారితో కలసి సింహగిరి పుణ్య క్షేత్రానికి వెళ్ళాడు. గురువుగారు మన క్రిష్ణమయ్యని కొండదిగువనే మఠంలో ఉంచి, వారు నరహరి దర్శనార్థం కొండపైకి వెళ్ళారు. ఆ వెళ్ళడం మూడురోజుల పాటూ ఉండిపోయారు. చిన్నతనం నుండీ గురువుగారినే నమ్ముకొని ఉన్న క్రిష్ణమయ్యకు ఈ ఎడబాటు దుర్భరం అయిపొయింది. ఆకలి దప్పులు చూసేవారు లేకపోయారు. కానీ ఏదిక్కూ లేనివాడికి ఆ దేవుడే దిక్కు అన్నట్లు నరసింహస్వామి కరుణా కటాక్ష వీక్షణాలు ఆ బాలుడిపై పడ్డాయి. బాలుని రూపం లో వచ్చిన స్వామి చిన్న గిన్నెతో పాలు తెచ్చి తాగమన్నారట. త్రాగిన పిదప ఆ పాలతో తడిసిన చేతులతో కంటినీరు తుడుచుకోగా చూపు వచ్చిందట. అప్పుడు బాలుని రూపం లోఉన్న స్వామే తన కాళ్ళపై పడిన కృష్ణమయ్యను పైకి లేపి, తనను చాతుర్లక్ష సంకీర్తనా వచనాలతో పూజించమని ఆజ్ఞాపించాడట.
అప్పటినుంచీ క్రిష్ణమయ్య సింహాచలం లోనే నివసిస్తూ సింహగిరి నరహరి వచనములు వ్రాసి శ్రీ వరాహ నారసింహుని పరవశింప జేసి బాలుని రూపం లో నాట్యమాడేలా  చేసిన భక్తాగ్రగణ్యుడయ్యాడు.  స్వామివారి పదకొండవ అవతారంగా కొనియాడబడిన భక్తులచే కృష్ణమయ్య తొలి తెలుగు వాగ్గేయ కారుడిగా ఖ్యాతికెక్కాడు.  
జనవరి 2000 వ సంవత్సరం లో ముద్రించబడిన ఈ పుస్తక రచయిత శ్రీమాన్ టి పి శ్రీరామ చంద్రాచార్యుల వారు... మరుగున పడిపోయిన శ్రీ కృష్ణమయ్య జీవిత చరిత్రనూ, వారి సింహగిరి నరహరి వచనాలనూ వెలుగులోకి తేవడానికి ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చీ, తంజావూరు సరస్వతీ మహల్లో తాళపత్రాలలోనూ , ఇదివరకు ముద్రితమైన గ్రంధాలలోనూ దొరికిన కొద్దిపాటి వచనాలనే గంగాజలాన్ని మనకు అందుబాటులోకి తెచ్చిన అపర భగీరథుడు.  236  పేజీల ఈ గ్రంధం దొరకు చోటు :
టి. పి. శ్రీరామ చంద్రాచార్యులు
7 - 48, బృందావని
సింహాచలం,
విశాఖపట్నం - 530028
ఫోను : 0891-2715427

టి టి డి వారు అన్నమాచార్య ప్రాజెక్టు నెలకొల్పి ఆయన కీర్తనలకు బహుళ ప్రచారం కల్పించినట్టే సింహాచలం దేవస్థానం వారు కూడా కృష్ణ మయ్య పేరుపై ఒక ప్రాజెక్టు రూప కల్పన చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. అది త్వరలో సాకారమవ్వాలని ఆశిద్దాం.
శ్రీ సింహాద్రి నాథుని చందన యాత్ర సందర్భం గా మిత్రులందరికీ శుభాకాంక్షలు.














ఈ వాగ్గేయకారుని గురించిన మరిన్ని లింకులు: 
వెలుగులోకి కృష్ణమయ్య కీర్తనలు - ఆంధ్రప్రభ
అన్నమయ్యకు ముందే కృష్ణమయ్య? - ప్రజాశక్తి
Vaartha : చీకట్లో కృష్ణమయ్య
Veyyellanaati mana krishnamayya: తొలి తెలుగు పదకర్త ... 
Andhra Bhoomi

Sunday, February 12, 2012

తనమేల కులమేల తపమే కారణము

రాగం: సావేరి  ,  స్వరకల్పన మరియు గానం: శ్రీ డి. పశుపతి
 
ప| తనమేల కులమేల తపమే కారణము
    యెలమి హరిదాసులు యేజాతి యైన నేమి


 చ| కాకమువల్లఁ బుట్టదా ఘనమైన యశ్వత్ధము
    దాకొని గుల్లలోఁ బుట్టదా ముత్తెము
    చౌకైన విషలతనే జన్మించదా నిర్విషము
    యేకడ మహానుభావు లెందు పుట్టి రేమి


చ| బిడిపిరాళ్ళాఁ బుట్టవా చెలువైన వజ్రములు
    పుడమి నీఁగలవల్లఁ బుట్టదా తేనె
    వెడగుఁ బిల్లి మేనను వెళ్ళదాయెనా జవ్వాది
    వుడివోని పుణ్యు లెందు నుదయించి రేమి

చ| పంకములో పుట్టదా పరిమళపుఁ దామెర
    పొంకపు కీటకములందు పుట్టదా పట్టు
    కొంకక శ్రీవేంకటేశు కొలిచిన దాసులు
    సంక లేని జ్ఞాను లెందు జనియించి రేమి

ఎవరైనా మహానుభావుడనిపించుకొనే యోగ్యత, అర్హత  అతను ఆచరించే పనుల బట్టే వుంటుంది కానీ, కులము వల్ల   కాదు. మనిషి యొక్క హోదా, వారు పుట్టిన కులము కాక వారి పూర్వజన్మ తపః ఫలమే కారణము. 


హరి భక్తులైన భాగవతోత్తములు ఏ కులములో పుట్టిననేమి?? వారికి ఈ జన్మలో అలవడిన ఈ హరిభక్తికి గతజన్మ సంస్కారమే కారణము. హరిభక్తి కలిగిన నరులకు వారి కులము అప్రస్తుతమై పోతుంది. 
అంత పెద్దదైన మర్రిచెట్టు పుట్టుక ఒక కాకి వల్ల సంభవించుట లేదా..?!( మర్రి చెట్టు పండును తిన్న కాకి జీర్ణం చేసుకోలేక వేరే చోట మట్టిలోన విడిచిన వ్యర్ధము నుండి తిరిగి మర్రి చెట్టు పుట్టి పెద్దది కావచ్చు). ఎక్కడో సముద్రపు అట్టడుగున వున్న ఆల్చిప్పలో ముత్యము పుట్టుటలేదా..?!!  
విషానికి విరుగుడుగా పనిచేసే ఔషధమును విషలతలనుంచే తయారు చేస్తారు కదా...!! మహానుభావులైన వారి యోగ్యతే ముఖ్యంగాని వారి పుట్టుక కాదు. 
నల్లగా అసహ్యముగా  కనిపించే బొగ్గుల మధ్యనే పుట్టవా జాతైన వజ్రములు..?!! చిన్న ప్రాణులైన తేనెటీగల వల్లనే కదా పట్టుతేనె లభించేది..?!! పునుగు పిల్లి శరీరము నుండి కాదా సువాసనల జవ్వాది పుట్టేది..?!! వుడివోని (?) పుణ్యాత్ములైన వారు ఎక్కడ జన్మిస్తేనేమి...?!!
మురికికూపములో పుట్టి పరిమళాలు విరజిమ్మే తామర పువ్వు, జుగుప్స కలిగించే గొంగళి పురుగుల నుండి లభించిన పట్టు దారములు, మనకు ఏవిధముగా ఉత్తమములుగా పరిగణించ బడెదవో అదేవిధముగా శ్రీ వేంకటేశ్వరునికి దాసులూ, ఆ శ్రీనివాసుని తత్వ జ్ఞాననిధులూ అయిన వారు ఏకులములో జన్మించినా ఉత్తములే కాగలరు.

ఈ పాటను శ్రీ డి. పశుపతి గారి గాత్రములో ఇక్కడ  వినండి.

Thursday, February 9, 2012

రాముడుద్భవించినాడు రఘుకులంబున (గాత్రం: డాక్టర్ మంగళంపల్లి బాలమురళి కృష్ణ)

రాముడుద్భవించినాడు రఘుకులంబున
కృతి కర్త: శ్రీ ప్రయాగ రంగదాసు         రాగం: జోన్ పురి       గాత్రం: డాక్టర్ మంగళంపల్లి బాలమురళి కృష్ణ 



ప||          రాముడుద్భవించినాడు రఘుకులంబునా శ్రీ 
                                                                                       ||రాముడుద్భవించినాడు||
అ.ప||      తామసులను దునిమి దివిజ సోమంబుల క్షేమముకై కోమలి కౌసల్యకు
                                                                                       ||రాముడుద్భవించినాడు||
చర||       తనరు చైత్ర శుధ్ధ నవమి పునర్వసందునా
             సరస కర్కాటక లగ్నమరయగ సురవరులెల విని కురియింపగ విరుల వాన
                                                                                       ||రాముడుద్భవించినాడు||
చర||      దశరధుండు భూసురులకు ధనమొసంగగా
            విసరె మలయ మారుతములు దిశలెల్లను విశదములై వసుమతి దుర్భరము బాప

                                                                                       ||రాముడుద్భవించినాడు||

చర||      ధరను గుడి మెళ్ళంపురమును అరసి బ్రోవగా
            కరుణతో శ్రీరంగదాసు మొరలిడగను కరుణుంచియు వరమివ్వగ స్థిరుడై

                                                                                       ||రాముడుద్భవించినాడు|| 

శ్రీ మంగళంపల్లి బాలమురళి గాత్రం లోవినండి 

Sunday, February 5, 2012

రామ రామ యనరాదా రఘుపతి రక్షకుడని వినలేదా (గాత్రం: బాలమురళి)

రామ  రామ  యనరాదా  రఘుపతి రక్షకుడని  వినలేదా 
రాగం: సింధుభైరవి   రచన: ప్రయాగ రంగదాసు      గాత్రం: బాలమురళి కృష్ణ
(శ్రీ ప్రయాగ రంగదాసు గారు బాలమురళి కృష్ణ గారి తాతగారు. ఈ పాట మా చిన్నప్పుడు రేడియోలో 'భక్తి రంజని' కార్యక్రమంలో వినిపించేది. ఇది కాక జంఝూటి రాగం లో  'రాముడుద్భవించినాడు రఘుకులంబున' కూడా చాలా బాగుంటుంది.)
********************

ప||       రామ  రామ  యనరాదా  రఘుపతి, రక్షకుడని  వినలేదా
           కామ  జనకుని  కదా  వినువారికి  కైవల్యంబే  కాదా

అ.ప||   ఆపద్బాంధవుడగు శ్రీ రాముని  ఆరాధింపక  రాదా
           పాపంబులు  పరిహార మొనర్చేది పరమాత్ముండే కాదా
 
చర||     సారహీన సంసార  భావాంబుధి  సరగున  దాటగరాదా
            నీరజాక్షుని  నిరతము  నమ్మితె నిత్యానందామె  కాదా

చర||      వసుధను గుడి మెల్లంకను వెలసిన వర  గోపాలుడే కాదా
            పసివాడగు శ్రీ రంగ దాసుని పాలించుట వినలేదా


 


ఇదే పాట ఇంకొక వేదిక పైన :
 

Sunday, July 3, 2011

అదినే నెఱగనా అంతలో భ్రమతుఁ గాక_Annamacharya_Balamurali Krishna

స్వరకల్పన, గానం: డా. మంగళంపల్లి బాలమురళి కృష్ణ
రాగం: శంకరాభరణం,   తాళం: త్రిశ్ర నడ - ఆది

ప. అదినే నెఱగనా అంతలో భ్రమతుఁ గాక
     మదనజనక నాకు మంచిబుధ్ధి యియ్యవే

చ. యెంత లోకానుభవము అంతయు వృధా నష్టి
     కొంతైన బ్రహ్మచింత కోటిలాభము
     వింతైన జనులతోడి వినోదము నిష్ఫలము
     చెంత సజ్జన సంగతి చేరిన యాదాయము

చ. నానాదేశ వార్తలు చింతా మూలము
     పూనిన పురాణ గోష్ఠి పుణ్యమూలము
     ఆనినకృషివాణిజ్యాలన్నియుఁ దీరని వెట్టి
     మానని యాచార మాత్మకుఁ బడ్డపాటు

చ.  పలు చుట్టరికములు బట్టబయలు తగుళ్ళు
     చెలగు నాచార్య సేవ జీవన్ముక్తి
     బలిమి శ్రీవేంకటేశ పరగ రెండు విధాలు
     నిలుకడయినవాడవు నీవే యిన్నిటికి

@@@@@@@@@@@@@

ప. అదినే నెఱగనా అంతలో భ్రమతుఁ గాక
     మదనజనక నాకు మంచిబుధ్ధి యియ్యవే
చేసే పని తప్పని తెలుసు... కానీ ఆ క్షణానికి  బుద్ధి గడ్డి తింటుంది. కోపాన్ని అదుపులో పెట్టుకోలేక ఎదుటివాళ్ళమీద విరుచుకు పడిపోతాం. ఆకోపం ఎక్కువ సేపుండదు. కానీ ఆ చిన్ననిప్పురవ్వే చాలు వాళ్ళ మనసు విరిచెయ్యడానికి.  తరువాత మనం అయ్యో అనుకోని ప్రయోజనం వుండదు. ఈ కీర్తన లోఅన్నమయ్య కూడా ఇలాంటి మనఃస్తితినే వర్ణిస్తున్నాడు. వివేకంతో ఆలోచించే మంచి బుద్ది ఇయ్యమని వేంకటేశ్వరుడిని వేడుకుంటున్నాడు. 

చ. యెంత లోకానుభవము అంతయు వృధా నష్టి
     కొంతైన బ్రహ్మచింత కోటిలాభము
     వింతైన జనులతోడి వినోదము నిష్ఫలము
     చెంత సజ్జన సంగతి చేరిన యాదాయము
పరతత్వంలో మన ఆదాయ వ్యయాలను అన్నమయ్య ఈ విధంగా వివరిస్తున్నాడు: లోకానుభవ మెంత ఉన్నా  పరబ్రహ్మమీద కాస్తంత ధ్యాస లేకపోతే దానివల్ల ప్రయోజనం లేదంటాడు. వినోదం పేరుతో స్నేహితులతో కాలక్షేపం చేసే కన్నా సజ్జన సాంగత్యంలో మనం నేర్చుకొనే విషయాలే మనకు ఆదాయమంటాడు.

*************

Sunday, June 19, 2011

ఎన్నడు తీరవు ఈపనులు..! Annamacharya_Balamurali Krishna

:: అన్నమాచార్య కీర్తన ::
రాగం: గౌళ , గానం: బాలమురళి కృష్ణ

ప. ఎన్నడు తీరవు ఈపనులు
     పన్నిన నీమాయ బహుళంబాయె   ||ఎన్నడు||

చ. పెక్కుమతంబుల పెద్దలునడచిరి
     ఒక్కసమ్మతై ఓడబడరు
     పెక్కుదేవతలు పేరు ఆడెదరు
     తక్కక ఘనులము తామేఅనుచు            ||ఎన్నడు||

చ. పలికెడి చదువులు బహుమార్గంబులు
     కలసి ఏకవాక్యత కాదు
     చలవాదంబులు జనులు మానరు
     పలు తర్కంబులె పచరించేరు                 ||ఎన్నడు||

చ. శరణాగతులకు శ్రీవేంకటేశ్వర
     తిరముగ నీవే తీర్చితివీ
     పరమవైష్ణవులు పట్టిరివ్రతము
     ఇరవుగ నాచార్యులెరుగుదురూ             ||ఎన్నడు||
@@@@@@@@@@@@@@@

Get this widget | Track details | eSnips Social DNA 

ఎవరి దారి వారిది, ఎవరి వాదం వారిది, ఎవరి (అభి)మతము వారిదిగా ఉండేటప్పుడు అందరూ ఒక ఏకాభిప్రాయానికి రాలేనప్పుడు " ఎన్నడు తీరవు ఈ పనులు" అని ఆవేదన చెందుతున్నాడు అన్నమయ్య. బాలమురళి పాటతో వినండి.
గౌళ 

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!