Sunday, February 12, 2012

తనమేల కులమేల తపమే కారణము

రాగం: సావేరి  ,  స్వరకల్పన మరియు గానం: శ్రీ డి. పశుపతి
 
ప| తనమేల కులమేల తపమే కారణము
    యెలమి హరిదాసులు యేజాతి యైన నేమి


 చ| కాకమువల్లఁ బుట్టదా ఘనమైన యశ్వత్ధము
    దాకొని గుల్లలోఁ బుట్టదా ముత్తెము
    చౌకైన విషలతనే జన్మించదా నిర్విషము
    యేకడ మహానుభావు లెందు పుట్టి రేమి


చ| బిడిపిరాళ్ళాఁ బుట్టవా చెలువైన వజ్రములు
    పుడమి నీఁగలవల్లఁ బుట్టదా తేనె
    వెడగుఁ బిల్లి మేనను వెళ్ళదాయెనా జవ్వాది
    వుడివోని పుణ్యు లెందు నుదయించి రేమి

చ| పంకములో పుట్టదా పరిమళపుఁ దామెర
    పొంకపు కీటకములందు పుట్టదా పట్టు
    కొంకక శ్రీవేంకటేశు కొలిచిన దాసులు
    సంక లేని జ్ఞాను లెందు జనియించి రేమి

ఎవరైనా మహానుభావుడనిపించుకొనే యోగ్యత, అర్హత  అతను ఆచరించే పనుల బట్టే వుంటుంది కానీ, కులము వల్ల   కాదు. మనిషి యొక్క హోదా, వారు పుట్టిన కులము కాక వారి పూర్వజన్మ తపః ఫలమే కారణము. 


హరి భక్తులైన భాగవతోత్తములు ఏ కులములో పుట్టిననేమి?? వారికి ఈ జన్మలో అలవడిన ఈ హరిభక్తికి గతజన్మ సంస్కారమే కారణము. హరిభక్తి కలిగిన నరులకు వారి కులము అప్రస్తుతమై పోతుంది. 
అంత పెద్దదైన మర్రిచెట్టు పుట్టుక ఒక కాకి వల్ల సంభవించుట లేదా..?!( మర్రి చెట్టు పండును తిన్న కాకి జీర్ణం చేసుకోలేక వేరే చోట మట్టిలోన విడిచిన వ్యర్ధము నుండి తిరిగి మర్రి చెట్టు పుట్టి పెద్దది కావచ్చు). ఎక్కడో సముద్రపు అట్టడుగున వున్న ఆల్చిప్పలో ముత్యము పుట్టుటలేదా..?!!  
విషానికి విరుగుడుగా పనిచేసే ఔషధమును విషలతలనుంచే తయారు చేస్తారు కదా...!! మహానుభావులైన వారి యోగ్యతే ముఖ్యంగాని వారి పుట్టుక కాదు. 
నల్లగా అసహ్యముగా  కనిపించే బొగ్గుల మధ్యనే పుట్టవా జాతైన వజ్రములు..?!! చిన్న ప్రాణులైన తేనెటీగల వల్లనే కదా పట్టుతేనె లభించేది..?!! పునుగు పిల్లి శరీరము నుండి కాదా సువాసనల జవ్వాది పుట్టేది..?!! వుడివోని (?) పుణ్యాత్ములైన వారు ఎక్కడ జన్మిస్తేనేమి...?!!
మురికికూపములో పుట్టి పరిమళాలు విరజిమ్మే తామర పువ్వు, జుగుప్స కలిగించే గొంగళి పురుగుల నుండి లభించిన పట్టు దారములు, మనకు ఏవిధముగా ఉత్తమములుగా పరిగణించ బడెదవో అదేవిధముగా శ్రీ వేంకటేశ్వరునికి దాసులూ, ఆ శ్రీనివాసుని తత్వ జ్ఞాననిధులూ అయిన వారు ఏకులములో జన్మించినా ఉత్తములే కాగలరు.

ఈ పాటను శ్రీ డి. పశుపతి గారి గాత్రములో ఇక్కడ  వినండి.

4 comments:

  1. కొద్దిగా క్లిష్టమైన పదాలతో కూర్చినా గొప్ప సత్యాలను చెప్పిన పాట. నిజంగా మనిషి యోగ్యతను పుట్టుక ద్వారా కాక, అతను ఆచరించే కర్మల ద్వారా నిర్ణయించగలిగి గౌరవించేలాంటి కాలం వస్తే ఎంత బాగుండును.

    ReplyDelete
  2. రాధేశ్యాం గారూ.......కాలానికి తగిన పాటని ఎంచుకున్నారండీ. నిజానికి ఈ కులమతాల ఘర్షణ ఇప్పుడున్నట్టు యే కాలం లోనూ లేదన్న మాటని అనేకానేక గ్రంధాలు నిరూపిస్తున్నాయి. మంచితనం, పరిశుభ్రత, దైవభక్తి, నిస్వార్ధత ఇవే ఆ రోజుల్లో పరిగణనకు తీసుకున్న విషయాలు. నూటికి తొంభై తొమ్మండుగురు అలాంటి ఉన్నతులే కావడం నాటి సమాజం చేసుకున్న పుణ్యం. ఐనా సమాజం లో భేదభావాలు మొలకెత్తకుండా సమభావాన్ని ప్రోత్సహించడంలో కళాకారులంతా తమ పాత్రని భేషుగ్గా నిర్వహించారు. ఏనాటిదో ఆ పాటని మళ్లీ వెలికి తీసి బ్లాగులో పెట్టిన మీ ఓపిక్కి, ఉత్సాహానికి నా అభినందనలు....

    ReplyDelete
  3. రాధేశ్యాం గారూ.......కాలానికి తగిన పాటని ఎంచుకున్నారండీ. నిజానికి ఈ కులమతాల ఘర్షణ ఇప్పుడున్నట్టు యే కాలం లోనూ లేదన్న మాటని అనేకానేక గ్రంధాలు నిరూపిస్తున్నాయి. మంచితనం, పరిశుభ్రత, దైవభక్తి, నిస్వార్ధత ఇవే ఆ రోజుల్లో పరిగణనకు తీసుకున్న విషయాలు. నూటికి తొంభై తొమ్మండుగురు అలాంటి ఉన్నతులే కావడం నాటి సమాజం చేసుకున్న పుణ్యం. ఐనా సమాజం లో భేదభావాలు మొలకెత్తకుండా కళాకారులంతా సమభావాన్ని ప్రోత్సహించడం లో తమ పాత్రని భేషుగ్గా నిర్వహించారు. ఏనాటిదో ఆ పాటని మళ్లీ వెలికి తీసి బ్లాగులో పెట్టిన మీ ఓపిక్కి, ఉత్సాహానికి నా అభినందనలు....

    ReplyDelete
  4. శివరాం ప్రసాద్ గారు చెప్పినట్టు, శాస్త్రీయ బాణీలకు అర్ధాలు చెప్పదం చాలా మంచి పని...కొనసాగించండి గుడ్ లక్!

    ReplyDelete

* దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
* వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!