Wednesday, May 11, 2011

అప్పులేనిసంసార మైనపాటే చాలు


సంగీత కళానిధి శ్రీ నేదునూరి కృష్ణమూర్తిగారి
అన్నమయ్య పదసౌరభము పుస్తకానికి 
నేను వేసిన ముఖచిత్రం


తృప్తితో జీవించడం ఎలా..!?
 
పోతన భాగవతం లో వామనుడు మూడడుగుల నేల  మాత్రమే కోరుకోవడం చూసి బలిచక్రవర్తి, వరచేలంబులో మాడలో ఫలములో వన్యంబులో గోవులో.. అంటూ చాలా పెద్ద జాబితా చెప్పి అవన్నీ కానీ, వాటిల్లో కనీసం ఏవొక్క టైనాగానీ    కోరుకోమ్మనీ, ఇచ్చేస్తాననీ అంటాడు.

అప్పుడు వామనుడు అంటాడు:


వ్యాప్తిన్ జెందక,వగవక,
ప్రాప్తించినలేశమైన పదివేలనిచున్
దృప్తింజెందని మనుజుఁడు
సప్త ద్వీపములనైనఁ జక్కంబడునే?


ఉన్నది చాలదన్నట్టు ఇంకా కావాలనుకోక, శోకాన్ని విడిచిపెట్టి,  దొరికిన కాసింతయే పదివేలనుకొని తృప్తి చెందని మనుజుడు భూమిమీద ఎక్కడైనా బాగుపడతాడా అని భావం. 

ఈ క్రింది కీర్తనలో మనిషిగా బ్రతకడానికి ఎంత చాలో (సరిపోతుందో) చెబుతున్నాడు అన్నమయ్య..! ఆంగ్లంలో Down to earth అంటాము కదా,  అలాంటి నిరాడంబర జీవితానికి, బ్రతుకడానికి అవసరమైనంత మాత్రమే కలిగి ఉంటూ తృప్తిగా ఎలా జీవించవచ్చో చెబుతున్నాడు.

పల్లవి :
అప్పులేనిసంసార మైనపాటే చాలు
తప్పులేనిజీత మొక్కతారమైనఁ జాలు

అప్పులేనివాడె అధిక సంపన్నుడు అన్నాడు వేమన. అన్నమయ్య, సంసారము అప్పులు లేకుండా ఉంటే చాలంటున్నాడు. ఐన పాటే చాలు అంటే అంత మాత్రమే చాలు అని..! తప్పుచేయగుండా ఆర్జించిన జీతము/ సంపాదన ఒక్క తారము ( నాలుగు కాసుల నాణెము) అయినా చాలు అంటున్నాడు. అంటే అప్పు, తప్పు చేయవద్దని..!

చరణం:
కంతలేనిగుడిశొక్కగంపంతయినఁ జాలు
చింతలేనుయంబ లొక్కచేరెఁడే చాలు
జంతగానితరుణి యేజాతైన నదె చాలు
వింతలేనిసంప దొక్కవీసమే చాలు


వ్యాఖ్యానము:
కంత = రంధ్రము, చిల్లు, ప్రకృతి నుంచి రక్షణ పొందటానికి ఒక పైకప్పుకు రంధ్రాలు లేని ఒక్క గుడిశ చాలు..! తినేది చారెడు అంబలే అయినా చింత లేకుండా - అంటే ఆలోచనలూ, ఆదుర్దా, బెంగా లేకుండా హాయిగా తింటే అదే చాలు.
జంత = ధూర్తురాలు, తిరుగుబోతు. స్త్రీలలో పద్మిని జాతి, ఇత్యాదిగా  నాలుగు జాతులు, వాటిబట్టీ ఆయా జాతులవారి లక్షణాలు చెబుతారు. పద్మిని జాతి స్త్రీ ఉత్తమలక్షణాలు కలిగి ఉంటుందని అంటారు. భార్య యైన స్త్రీ ఏ జాతి యైనా సరే జంత - అంటే చెడుతిరుగుళ్ళు తిరిగేది కాకపోతే అంతే చాలు.
మన సంపాదన వింతనూ, ఆశ్చర్యాన్నీ కలిగించకూడదు. అలాంటి ఆకస్మిక ధనలాభం లేదా ఆదాయానికి మించిన ఆస్తులు లేకుండా అంటే అక్రమార్జన లేని ఒక్క వీసమెత్తు సంపద (వీసము - రూకలో పదహారవ భాగము) ఉన్నా అదే చాలు.


చరణం 2: 
తిట్టులేనిబ్రదు కొక్కదినమైన నదె చాలు
ముట్టులేనికూ డొక్కముద్దెఁడే చాలు
గుట్టుచెడి మనుకంటే కొంచపుమేలైనఁ జాలు
వట్టిజాలిఁ బడుకంటే వచ్చినంతే చాలు


వ్యాఖ్యానము:
మాటపడకుండా బ్రతికే ఒక్క రోజైనా చాలు జీవితానికి..! ముట్టు లేని - శుచి లేనిది కాని (అంటే శుచి యైనది) ఒక్క ముద్దయైనా చాలు భోజనానికి..! గుట్టు చెడిపోయి మనుగడ సాగించడం కంటె తక్కువలోఉన్నా సుఖంగా ఉంటే చాలు. అంటే ఆర్భాటాలకి పోయి ఇంటి గుట్టు బయట పెట్టుకొనే బదులు సామాన్యంగా ఉన్నా సంతోషంగా జీవిస్తే చాలు. ప్రయోజనం లేని/ రాబడి రాని పనికి పరుగెత్తే బదులు ఎంతవస్తే అంతే చాలు.

చరణం-3:
లంపటపడనిమేలు లవలేశమే చాలు
రొంపికంబమౌకంటె రోయుటే చాలు
రంపపుఁగోరికకంటె రతి వేంకటపతి-
పంపున నాతనిఁజేరేభవమే చాలు 
 
వ్యాఖ్యానము:
ఆపదకలుగజేయని మేలు అతిచిన్నది చేసినా చాలు..! రొంపికంబము - నిలుకడ లేనిది, అస్థిరమైనది; రోయు = రోత పడు, విడిచిపెట్టు. నిలుకడలేకుండా ఉండే పని కన్నా నివారించడం/ విడిచి పెట్టడం మేలు. రంపపు కోతకు గురిచేసే కోరికలతో అల్లాడడం కన్నా శ్రీవేంకటపతి పంపున ( ఆజ్ఞకు లోబడి) ఆ స్వామిని చేరే బ్రతుకే చాలు.

Tuesday, May 10, 2011

ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమే మున్నది...


రాగం : బౌళి స్వరరచన: డా. మంగళంపల్లి బాలమురళీ కృష్ణ

ప| ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమే మున్నది
నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను

చ| మరవను ఆహారంబును మరవను సంసార సుఖము
మరవను యింద్రియ భోగము మాధవ నీ మాయ
మరచెద సుఙ్ణానంబును మరచెద తత్త్వ రహశ్యము

మరచెద గురువును దైవము మాధవ నీ మాయ


చ| విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు
విడువను మిక్కిలి యాసలు విష్ణుడ నీమాయ
విడిచెద షట్కర్మంబులు విడిచెద వైరాగ్యంబును

విడిచెద నాచారంబును విష్ణుడ నీమాయ

చ| తగిలెద బహు లంపటముల తగిలెద బహు బంధముల
తగులను మోక్షపు మార్గము తలపున యెంతైనా
అగపడి శ్రీ వేంకటేశ్వర అంతర్యామివై

నగి నగి నను నీవేలితి నాకాయీమాయ

ప్రసీద గారి 'నామనసు పలికే' బ్లాగులో ఈ కీర్తన గురించి వ్రాసిన వ్యాఖ్యానం ఈ క్రింద లింక్ నొక్కి చదవండి.

మహి నుద్యోగి గావలె మనుజుఁడైనవాఁడు

రాగం : వరాళి

ప : మహినుద్యోగి గావలె మనుజుఁడైనవాఁడు
సహజివలె నుం డేమీ సాధింపలేడు

చ : వెదకి తలఁచుకొంటే విష్ణుఁడు గానవచ్చు
చెదరి మఱచితే సృష్టి చీఁకటౌ
పొదలి నడచితేను భూమెల్లా మెట్టి రావచ్చు
నిదిరించితేఁ గాలము నిమిషమై తోఁచు

చ : వేడుకతోఁ జదివితే వేదశాస్త్ర సంపన్నుఁడౌ
జాడతో నూరకుండితే జడుఁడౌను
వోడక తపసియైతే వున్నతోన్నతుఁడౌ
కూడక సోమరియైతే గుణహీనుఁ డౌను

చ : మురహరుఁ గొలిచితే మోక్షము సాధించవచ్చు
వెరవెఱఁగకుండితే వీరిడియౌను
శరణంటే శ్రీవేంకటేశ్వరుఁడు రక్షించును
పరగ సంశయించితే పాషండుఁడౌను

Monday, May 9, 2011

శ్రీ రాముల దివ్య నామ స్మరణ



పాట పాడిన వారు: రాధేశ్యాం

శ్రీ రాముల దివ్య నామ స్మరణ సేయుచున్న చాలు/ ఘోరమైన తపములను కోర నేటికే మనసా//
తారక శ్రీ రామనామ ధ్యానము చేసిన చాలు వేరువేరు దైవములను వెదక నేటికే మనసా //శ్రీ రాముల


ఉపోద్ఘాతం..

మన వాగ్గేయకారుల రచనల్లో భక్తితత్వానికి అగ్రతాంబూలం లభించినా మానవత్వానికీ, విలువలకీ, సామాజిక స్పృహకీ అద్దం పట్టే వారి వ్యాఖ్యలు వారి రచనల్లో సందర్భానుసారంగా దొర్లిన సందర్భాలు కోకొల్లలు. మనిషి అవలక్షనాలనూ, కుల మతాల ముసుగులోనో, ఆచార వ్యవహారాల పేరుమీదో సాటి మనుషుల మీద పెత్తనం చెలాయించే వర్గం యొక్క కుత్సితాన్నీ, బయట పెడుతూనే మానవ శ్రేయస్సుకూ వారి వ్యక్తిత్వ వికాసానికీ దోహదపడే సూచనలెన్నో మన వాగ్గేయకారుల రచనల్లో మనకు కనిపిస్తాయి. అలాంటి అమృతతుల్యమైన పలుకులను, కీర్తనలనూ, అందరం పంచుకోవడమే బ్లాగ్ ముఖ్యోద్దేశం. కుల, మత, భాషా, ప్రాంతీయ, భాషా భేదాలకతీతంగా 'వసుధైక కుటుంబం' గా ప్రజలందరూ మెలగవలసిన అవసరం ఎంతైనా ఉంది.

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!