Tuesday, May 10, 2011

ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమే మున్నది...


రాగం : బౌళి స్వరరచన: డా. మంగళంపల్లి బాలమురళీ కృష్ణ

ప| ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమే మున్నది
నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను

చ| మరవను ఆహారంబును మరవను సంసార సుఖము
మరవను యింద్రియ భోగము మాధవ నీ మాయ
మరచెద సుఙ్ణానంబును మరచెద తత్త్వ రహశ్యము

మరచెద గురువును దైవము మాధవ నీ మాయ


చ| విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు
విడువను మిక్కిలి యాసలు విష్ణుడ నీమాయ
విడిచెద షట్కర్మంబులు విడిచెద వైరాగ్యంబును

విడిచెద నాచారంబును విష్ణుడ నీమాయ

చ| తగిలెద బహు లంపటముల తగిలెద బహు బంధముల
తగులను మోక్షపు మార్గము తలపున యెంతైనా
అగపడి శ్రీ వేంకటేశ్వర అంతర్యామివై

నగి నగి నను నీవేలితి నాకాయీమాయ

ప్రసీద గారి 'నామనసు పలికే' బ్లాగులో ఈ కీర్తన గురించి వ్రాసిన వ్యాఖ్యానం ఈ క్రింద లింక్ నొక్కి చదవండి.

2 comments:

  1. ఈ కీర్తన అంటే నాకు చాలా ఇష్టం. ఒక కచేరీలో ప్రియా సిస్టర్స్ పాడిన తర్వాత నేను రాసిన టపా ఇది. వీలున్నప్పుడు చూడండి.
    http://praseeda1.blogspot.com/2011/02/blog-post.html

    ReplyDelete
  2. అన్నమాచార్యుల వారి మరొక ఆధ్యాత్మసంకీర్తన ఇది.
    మాయా మోహితమైన ఈ సంసారమనే సాగరంలో కొట్టుకుపోతున్నప్పుడు.. ఎంతో దుర్లభమైన మనుష్య జన్మమెత్తి ఫలమేమున్నది? నిజముగా నిన్ను నమ్మిన నన్ను ఒడ్డుకు చేర్చే భారం నీదే.
    దైనందిన చర్యల్లో పడి మనల్ని మోక్ష మార్గం వైపు నడిపించే జ్ఞాన సంపద, తత్వసారము, గురువునీ, దైవాన్నీ మరచిపోతూనే వున్నాను.
    సంధ్య, జప, హోమ, దేవతారాధన, ఆతిథ్య, వైశ్యదేవములనే షట్కర్మలు.. వైరాగ్యమూ(నాదనుకున్నఏదీ పోయేటప్పుడు నావెంట రాదు అనే స్పృహతో స్వార్ధ చింతనని దరిచేరనివ్వకపోవడం), ఆచారమూ విడిచిపెట్టి... పాపమూ, చెడు గుణాలూ, అత్యాశ వంటి నీచకర్మలలో మునిగి తేలుతున్నాను.
    లంపటాలు, బంధాలకు చిక్కుబడిపోతానే కానీ..నన్ను నీ దగ్గరికి చేర్చే మోక్షమార్గంలో పడే తలపుకూడా రావట్లేదే.. నను పాలించే దైవానివని నిన్నే నమ్మిన నాకా ఈ మాయ..!!
    ప్రసీద గారి మాటల్లో..
    "మనుష్యుల జీవన విధానాన్నీ, మాయా మోహపు జీవిత చక్రంలో ఇమిడిపోయి తెలుసుకోవలసిన సత్యాలనీ, విధానాల్నీ తెలుసుకోలేక పోవడాన్ని ఆవిష్కరిస్తూనే ఇది అంతా నీ మాయ మాత్రమే కదయ్యా, నా తప్పేముంది అని దేవుడిని అడుగుతారు. అలాగే నాకేమీ తెలియదు.. ఎంత గొప్ప జన్మ ఎత్తినా సరే.. నిజంగా నిన్నే నమ్మాను కనక అంతా నీ ఇష్టం అని ఆ అంతర్యామి పైనే భారం మోపుతారు ఆచార్యులవారు"

    ReplyDelete

* దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
* వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!