మన వాగ్గేయకారుల రచనల్లో భక్తితత్వానికి అగ్రతాంబూలం లభించినా మానవత్వానికీ, విలువలకీ, సామాజిక స్పృహకీ అద్దం పట్టే వారి వ్యాఖ్యలు వారి రచనల్లో సందర్భానుసారంగా దొర్లిన సందర్భాలు కోకొల్లలు. మనిషి అవలక్షనాలనూ, కుల మతాల ముసుగులోనో, ఆచార వ్యవహారాల పేరుమీదో సాటి మనుషుల మీద పెత్తనం చెలాయించే వర్గం యొక్క కుత్సితాన్నీ, బయట పెడుతూనే మానవ శ్రేయస్సుకూ వారి వ్యక్తిత్వ వికాసానికీ దోహదపడే సూచనలెన్నో మన వాగ్గేయకారుల రచనల్లో మనకు కనిపిస్తాయి. అలాంటి అమృతతుల్యమైన పలుకులను, కీర్తనలనూ, అందరం పంచుకోవడమే ఈ బ్లాగ్ ముఖ్యోద్దేశం. కుల, మత, భాషా, ప్రాంతీయ, భాషా భేదాలకతీతంగా 'వసుధైక కుటుంబం' గా ప్రజలందరూ మెలగవలసిన అవసరం ఎంతైనా ఉంది.
"సూక్తులు తెలియనిదెవరికి!? ఈ అంశం మీద బ్లాగులెన్ని లేవు..!? మళ్ళీ ఇదంతా అవసరమా..!!??"
కుండెడు తియ్యటి నీళ్ళని, చారెడు ఉప్పుతో రుచి మార్పించెయ్యోచ్చు. కానీ అదే కుండెడు ఉప్పునీళ్ళని మళ్ళీ మునుపటి తీయదనానికి తేవడం దాదాపు అసాధ్యం..! కానీ దానికి మరో పది కుండలు మంచినీళ్ళు కలిపితే ఉప్పదనం రుచికి అందదు..!! అందుకే ఇలాంటి మాటలు ఎవరు చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా తీయదనం పెరుగుతుందే గానీ తగ్గదు.
సూక్తులు అందరికీ తెలుసు. కానీ ఆచరణలో పెట్టటానికి మానవ కల్పితమైన అవరోధాలు 'అవసరార్ధం' అనో, 'ఈ ఒక్కసారికీ..!' అనో గడిపేస్తుంటాం. ఆ మనో దౌర్బల్యానికి విరుగుడు మనం ఒకటికి పదిసార్లు ఈ 'వాక్సుధా స్రవంతి' ని మననం చేసుకొంటూ ఉండడమే. తద్వారా ఆ విలువలను మన జీవనంలో ఆచరిస్తూ సత్సమాజ నిర్మాణానికి మనవంతు తోడ్పాటు నందించగలం. 'వాగ్గేయ సుధా స్రవంతి' ఆ లక్ష్యానికే ఉడతాభక్తిగా తనవంతు కృషి చేస్తుంది.
నా మనసులో ఏదో మూల వున్న ఆలోచనలకు వారి వ్యాఖ్యద్వారా మూర్తిమత్వాన్ని అందించిన శ్రేయోభిలాషి శ్రీ కప్పగంతు శివరామప్రసాద్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలర్పిస్తూ..
కార్యోన్ముఖుడినవుతున్నాను.
నా మొదటి పోస్టుతో మళ్ళీ మీ ముందుకొస్తాను.
రాధేశ్యాం
ReplyDeleteమీ ధ్యేయం చాలా బాగున్నది. మనకున్న కర్నాటిక్ సంగీతం ఏదో అలవాటుగా వినేయ్యటమే కాని ఆ కీర్తనలను అర్ధం కూడ చూసి ఆయా మాటలను "నిజంగా" అర్ధం చేసుకుని వినే వాళ్ళు అతి తక్కువ. ఎక్కువ మందికి సంగీతం అంటే సరిగమల సంకలనం, సరిగమల కూర్పు మాత్రమె. అర్ధం గురించి కాకుండా ఆ పాట ఎక్కడ ఎలా పాడారు, ఆరోహణ అవరోహణ, షడ్జమం వంటి మాటలతో కాలం గడిపేస్తారు. ఒక చక్కటి విషయాన్ని ప్రజల మనస్సుకు హత్తుకునేట్టుగా చెప్పటానికి అలనాటి మన పెద్దలు సంగీతాన్ని ఒక మీడియం గా వాడుకున్నారు. ఆ చక్కటి మాటలను తేటతెల్లం చేస్తూ అందరికీ తెలియచెప్పటానికి మీరు ఈ బ్లాగు తయారు చెయ్యటం అద్భుతంగా ఉన్నది.
మీ కొత్త బ్లాగు మొదలుపెడుతున్న సందర్భంగా మీకు శుభాకాంక్షలు. అనతికాలంలోనే మీ బ్లాగు ఎంతో ప్రాచుర్యం పొందగలదు.