Friday, November 12, 2021

అప్పులేని సంసారమైనపాటే చాలు..!

 


సంగీత కళానిధి శ్రీ నేదునూరి కృష్ణమూర్తిగారి
అన్నమయ్య పదసౌరభము పుస్తకానికి 
నేను వేసిన ముఖచిత్రం


తృప్తితో జీవించడం ఎలా..!?
 
పోతన భాగవతం లో వామనుడు మూడడుగుల నేల  మాత్రమే కోరుకోవడం చూసి బలిచక్రవర్తి, వరచేలంబులో మాడలో ఫలములో వన్యంబులో గోవులో.. అంటూ చాలా పెద్ద జాబితా చెప్పి అవన్నీ కానీ, వాటిల్లో కనీసం ఏవొక్కటైనా గానీ    కోరుకోమ్మనీ,  ఇచ్చేస్తాననీ అంటాడు.

అప్పుడు వామనుడు అంటాడు:


వ్యాప్తిన్ జెందక,వగవక,
ప్రాప్తించినలేశమైన పదివేలనిచున్
దృప్తింజెందని మనుజుఁడు
సప్త ద్వీపములనైనఁ జక్కంబడునే?



ఉన్నది చాలదన్నట్టు ఇంకా కావాలనుకోక, శోకాన్ని విడిచిపెట్టి,  దొరికిన కాసింతయే పదివేలనుకొని తృప్తి చెందని మనుజుడు భూమిమీద ఎక్కడైనా బాగుపడతాడా అని భావం. 

ఈ క్రింది కీర్తనలో మనిషిగా బ్రతకడానికి ఎంత చాలో (సరిపోతుందో) చెబుతున్నాడు అన్నమయ్య..! ఆంగ్లంలో Down to earth అంటాము కదా,  అలాంటి నిరాడంబర జీవితానికి, బ్రతుకడానికి అవసరమైనంత మాత్రమే కలిగి ఉంటూ తృప్తిగా ఎలా జీవించవచ్చో చెబుతున్నాడు.

పల్లవి :
అప్పులేనిసంసార మైనపాటే చాలు
తప్పులేనిజీత మొక్కతారమైనఁ జాలు

అప్పులేనివాడె అధిక సంపన్నుడు అన్నాడు వేమన. అన్నమయ్య, సంసారము అప్పులు లేకుండా ఉంటే చాలంటున్నాడు. ఐన పాటే చాలు అంటే అంత మాత్రమే చాలు అని..! తప్పుచేయగుండా ఆర్జించిన జీతము/ సంపాదన ఒక్క తారము ( నాలుగు కాసుల నాణెము) అయినా చాలు అంటున్నాడు. అంటే అప్పు, తప్పు చేయవద్దని..!

చరణం:
కంతలేనిగుడిశొక్కగంపంతయినఁ జాలు
చింతలేనుయంబ లొక్కచేరెఁడే చాలు
జంతగానితరుణి యేజాతైన నదె చాలు
వింతలేనిసంప దొక్కవీసమే చాలు


వ్యాఖ్యానము:
కంత = రంధ్రము, చిల్లు, ప్రకృతి నుంచి రక్షణ పొందటానికి ఒక పైకప్పుకు రంధ్రాలు లేని ఒక్క గుడిశ చాలు..! తినేది చారెడు అంబలే అయినా చింత లేకుండా - అంటే ఆలోచనలూ, ఆదుర్దా, బెంగా లేకుండా హాయిగా తింటే అదే చాలు.
జంత = ధూర్తురాలు, తిరుగుబోతు. స్త్రీలలో పద్మిని జాతి, ఇత్యాదిగా  నాలుగు జాతులు, వాటిబట్టీ ఆయా జాతులవారి లక్షణాలు చెబుతారు. పద్మిని జాతి స్త్రీ ఉత్తమలక్షణాలు కలిగి ఉంటుందని అంటారు. భార్య యైన స్త్రీ ఏ జాతి యైనా సరే జంత - అంటే చెడుతిరుగుళ్ళు తిరిగేది కాకపోతే అంతే చాలు.
మన సంపాదన వింతనూ, ఆశ్చర్యాన్నీ కలిగించకూడదు. అలాంటి ఆకస్మిక ధనలాభం లేదా ఆదాయానికి మించిన ఆస్తులు లేకుండా అంటే అక్రమార్జన లేని ఒక్క వీసమెత్తు సంపద (వీసము - రూకలో పదహారవ భాగము) ఉన్నా అదే చాలు.

చరణం 2: 
తిట్టులేనిబ్రదు కొక్కదినమైన నదె చాలు
ముట్టులేనికూ డొక్కముద్దెఁడే చాలు
గుట్టుచెడి మనుకంటే కొంచపుమేలైనఁ జాలు
వట్టిజాలిఁ బడుకంటే వచ్చినంతే చాలు


వ్యాఖ్యానము:
మాటపడకుండా బ్రతికే ఒక్క రోజైనా చాలు జీవితానికి..! ముట్టు లేని - శుచి లేనిది కాని (అంటే శుచి యైనది) ఒక్క ముద్దయైనా చాలు భోజనానికి..! గుట్టు చెడిపోయి మనుగడ సాగించడం కంటె తక్కువలోఉన్నా సుఖంగా ఉంటే చాలు. అంటే ఆర్భాటాలకి పోయి ఇంటి గుట్టు బయట పెట్టుకొనే బదులు సామాన్యంగా ఉన్నా సంతోషంగా జీవిస్తే చాలు. ప్రయోజనం లేని/ రాబడి రాని పనికి పరుగెత్తే బదులు ఎంతవస్తే అంతే చాలు.

చరణం-3:
లంపటపడనిమేలు లవలేశమే చాలు
రొంపికంబమౌకంటె రోయుటే చాలు
రంపపుఁగోరికకంటె రతి వేంకటపతి-
పంపున నాతనిఁజేరేభవమే చాలు 
 
వ్యాఖ్యానము:
ఆపదకలుగజేయని మేలు అతిచిన్నది చేసినా చాలు..! రొంపికంబము - నిలుకడ లేనిది, అస్థిరమైనది; రోయు = రోత పడు, విడిచిపెట్టు. నిలుకడలేకుండా ఉండే పని కన్నా నివారించడం/ విడిచి పెట్టడం మేలు. రంపపు కోతకు గురిచేసే కోరికలతో అల్లాడడం కన్నా శ్రీవేంకటపతి పంపున ( ఆజ్ఞకు లోబడి) ఆ స్వామిని చేరే బ్రతుకే చాలు.


గరికపాటి వారు వ్రాసిన క్రింది పద్యం ఈ సందర్భంగా చెప్పుకొనదగినది:

"తినుటకు నున్నచాలు అతిథిం గనినంతనె తల్పుతీసి ర/
మ్మనుటకునున్నచాలుతన యాలును బిడ్డలు నొక్కచోట కూ/
ర్చొనుటకునున్నచాలు పెడచూపులు చూడక మంచిదారిలో /
మనుటకునున్నచాలుమనమా!రసమార్గమువీడబోకుమా!

మరిన్ని చక్కటి వెబ్ సైట్లు..!!